నాగర్‌కర్నూల్ క్రైం: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుందని, కంటిచూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం చేయగలుగుతామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్– అలైవ్ కార్యక్రమంలో జిల్లా పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఆటోడ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కంటిచూపు సరిగా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతిఒక్కరు కంటిచూపుపై జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంటిచూపు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమని, ముఖ్యంగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారు కళ్లద్దాలు ఉపయోగించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యంత అవసరమని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వాహన వేగ నియంత్రణ, మద్యం తాగి డ్రైవింగ్ చేయకపోవడం వంటి ప్రాథమిక భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ రవికుమార్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


