నెట్టెంపాడుకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

నెట్టెంపాడుకు మహర్దశ

Mar 4 2026 8:41 AM | Updated on Mar 4 2026 8:41 AM

ప్రభుత్వానికి నివేదిక..

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మట్టి కాల్వలకు సీసీ లైనింగ్‌ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. 150 కి.మీ. మేర కాల్వలకు సీసీ లైనింగ్‌ నిర్మాణానికి రూ. 373 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు సిద్ధం చేశాం. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతాం.

– రహీముద్దీన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌శాఖ

గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి మహర్దశ పట్టనుంది. తరచుగా లీకేజీలతో కోతలకు గురవుతున్న ప్రాజెక్టు మట్టి కాల్వలకు సీసీ లైనింగ్‌ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 1.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే సాగునీటి కాల్వలకు ఇప్పటి వరకు సీసీ లైనింగ్‌ చేయలేదు. దీంతో కాల్వల్లో షిల్టు, పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగాయి. దీంతో కాల్వలకు లీకేజీలు ఏర్పడి సాగునీరు వృథా అవుతోంది. తద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 150 కి.మీ. మేర ఉన్న కాల్వలకు సీసీ లైనింగ్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ. 373కోట్లతో అంచనాలు రూపొందించారు.

నీటి పారుదలకు అడ్డంకులు..

వానాకాలంలో కృష్ణానదికి వరదలు వచ్చే 120 రోజుల పాటు జూరాల ప్రాజెక్టు వెనకజలాల నుంచి నెట్టెంపాడుకు నీటిని ఎత్తిపోస్తారు. ఎత్తిపోసే నీటిని ఏడు రిజర్వాయర్లలో నింపి.. వాటి పరిధిలోని ఆయకట్టుకు కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్‌ డిస్టిబ్యూటర్ల ద్వారా నీటిని పారిస్తారు. ఇలా ఆయకట్టుకు సాగునీరు పారించే కాల్వలకు లైనింగ్‌ లేకపోవడంతో కంపచెట్టు, ముళ్లపొదలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో చాలా వరకు సాగునీరు వృథాగా పోతుంది. ప్రస్తుతం నెట్టెంపాడు కింద సుమారు 1.49 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తుండగా.. ఇందులో 2 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతోంది.

తీరనున్న సమస్య..

నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన మట్టి కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్‌ డిస్టిబ్యూటర్లలో సీసీ లైనింగ్‌ నిర్మాణంతో నీటి పారుదల సాఫీగా సాగనుంది. తద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరనుంది. 150 కి.మీ. మేర కాల్వకు సీసీ లైనింగ్‌ నిర్మాణానికి రూ. 373 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు.

2లక్షల ఎకరాల ఆయకట్టు..

కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ఆధారంగా గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ. 1,480 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన నిర్మాణానికి రూ. 2వేల కోట్లపైగా ఖర్చుచేశారు. ఇందులో ఏడు రిజర్వాయర్లు, రెండు లిఫ్టులు, 164 కి.మీ. మెయిన్‌ కెనాల్స్‌, మరో 100 కి.మీ. మేర డిస్టిబ్యూటర్ల నిర్మాణాలు ఉన్నాయి.

కాల్వల లైనింగ్‌కు రూ.373 కోట్లతో ప్రతిపాదనలు

150 కి.మీ. మేరసీసీ నిర్మాణానికి చర్యలు

పనులు పూర్తయితే

సాగునీటి లీకేజీలకు అడ్డుకట్ట

ప్రభుత్వ అనుమతులే తరువాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement