యూరియా కోసం వేచి చూడాల్సిన పనిలేదు..
నాగర్‌కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ పరిధిలో 167–కే జాతీయ రహదారి భూ సేకరణ ప్రక్రియలో పురోగతిని, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చివరి దశలో ఉన్న భూ సేకరణ ప్రక్రియలో జాప్యం చేయకుండా మానవీయ కోణంలో రైతులకు లాభాలు వివరించి.. త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం, అవార్డుల ఖరారు వంటి అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆదిత్యధర్ త్రివేది, ఆర్డీఓలు, సురేశ్, భన్సీలాల్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ పాల్గొన్నారు.
అచ్చంపేట: రైతులు యూరియా కోసం వేచి చూడాల్సిన పనిలేదని.. యాప్‌లో బుక్ చేసుకుంటే యూరియా లభిస్తోందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అచ్చంపేటలోని హాకా రైతు సేవాకేంద్రం, యూరియా విక్రయ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడా రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తద్వారా వ్యవసాయం చేసే నిజమైన రైతుకు యూరియా లభిస్తుందన్నారు. జిల్లాలోని ఏ దుకాణం నుంచి అయినా యూరియా బుక్ చేసుకొని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. రైతులు యూరియా తీసుకునే సమయంలో తప్పనిసరిగా బుకింగ్ ఐడీని డీలర్‌కు చూపించాలన్నారు. యాప్‌లో బుక్ చేసిన బస్తాల సంఖ్య ఆధారంగా మాత్రమే డీలర్లు యూరియా అందించాలని ఆదేశించారు. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ మరింత పెంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు విక్రయించాలని స్పష్టంచేశారు. రైతుల అవసరం మేరకు సరిపడా యూరియా అందుబాటులో ఉండాలన్నారు. డీఏఓ యశ్వంత్‌రావు, డివిజనల్ అధికారి చంద్రశేఖర్, ఏఓ కృష్ణయ్య ఉన్నారు.


