నేడే ఆఖరు
● రెండో రోజు నామినేషన్లకు పోటెత్తిన అభ్యర్థులు
● గురువారం ఒక్కరోజే 177 దాఖలు
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండో రోజు గురువారం 177 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు 209 నామినేషన్లు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ తరఫున 68, బీఆర్‌ఎస్ నుంచి 75, బీజేపీ నుంచి 27, ఇతర పార్టీల నుంచి 5, ఇండిపెండెంట్ అభ్యర్థులు 31 నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లతో పోటెత్తనున్నారు.
బీఫారాలపై వీడని ఉత్కంఠ..
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఇప్పటివరకు బీఫారాలు దక్కలేదు. పార్టీ టికెట్‌పై స్పష్టత లేకపోయినా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు సమర్పించారు. మున్సిపల్ నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారం పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కానున్నాయి. పార్టీ బీఫారాలు చేతికందే వరకు అభ్యర్థులకు ఉత్కంఠ కొనసాగనుంది.
భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయండి


