వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే
తిమ్మాజిపేట/బిజినేపల్లి: జిల్లాలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేకు చర్యలు తీసుకుంటున్నామని.. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన ఉన్న రైతులు మోకాపై ఉండాలని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. గురువారం తిమ్మాజిపేట మండలం మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామాల్లో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకు జిల్లాలోని నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వివరించారు. భూముల రికార్డులు ఆన్‌లైన్‌లో ఉండటంతో పాటు రైతులు మోకాపై ఉండాలన్నారు. భూముల సర్వేతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్‌లో మొబైల్‌లోనే మ్యాప్‌ల ద్వారా తాము ఎంచుకున్న భూముల సర్వే నంబర్, రైతు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. భూముల సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జయంతి, మున్నీరుద్దీన్, జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐ సుదర్శన్ ఎంఆర్‌ఐ రవిచంద్ర, సర్పంచ్ రమాదేవి, ఉపసర్పంచ్ వెంకటయ్య, సర్వేయర్ సాయిబాబా పాల్గొన్నారు.


