వ్యాక్సినేషన్ నిర్వహణలో అలసత్వం వహించొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం/తెలకపల్లి: జిల్లాలో మాతా శిశువులకు అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, నిల్వల నిర్వహణలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌ను సందర్శించి.. టీకాల నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. టీకాల కొరత రాకుండా ముందస్తుగానే ఇండెంట్లు పంపాలని, అత్యవసర నిల్వలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా ముందుకు సాగాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ సురేశ్‌కుమార్, కళ్యాణ్ పాల్గొన్నారు.
● తెలకపల్లి మండలం ఆలేరులోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్, పెద్దూరు ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్‌ఓ సూచించారు.


