యూరియా కోసం పడిగాపులు
పెద్దకొత్తపల్లి: యూరియా కష్టాలు రైతులకు తీరడం లేదు. పంటలకు అవసరమైన యూరియా కోసం పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. గురువారం కొత్తపేట సింగిల్‌విండో పరిధిలోని రైతులు తెల్లవారుజామునే యూరియా కోసం పీఏసీఎస్ వద్దకు చేరుకొని పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ను క్యూలైన్‌లో ఉంచి అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. తీరా అధికారులు, సిబ్బంది వచ్చాక మొదటి వరుసలో ఉన్న రైతులకు మాత్రమే యూరియా లభించింది. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. మండలంలోని రైతులు వరితో పాటు మొక్కజొన్న పంటను అధికంగా సాగుచేశారు. రెండు పంటలకు ఒకేసారి యూరియా అవసరం ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటి వరకు వచ్చిన యూరియాను అవసరం ఉన్న రైతులతో పాటు అవసరం లేని వారు కూడా తీసుకెళ్తుండటంతో కొరత నెలకొంటోంది. ఇకపై యూరియా యాప్‌లో బుకింగ్ చేసుకునే రైతులకే యూరియా అందించనున్నట్లు ఏఓ శిరీష తెలిపారు.


