ముంపు నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని 54 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు అన్నారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణ సామర్థ్యం తగ్గించాలని ఎర్రవల్లిలో చేపట్టిన దీక్షలు శనివారం 54వ రోజు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని శనివారం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌తో కలిసి ఎంపీ మల్లురవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఎంపీ మల్లురవి గోకారం జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాల సమస్యను తీసుకెళ్లడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ముంపు గ్రామాలను మినహాయింపు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు ప్రకాష్, పెద్దయ్యగౌడ్, నాగయ్య, గోపినాయక్, లాలునాయక్, శ్రీరాములు, వెంకటయ్యనాయక్ పాల్గొన్నారు.


