వెట్టి చాకిరి నుంచి విముక్తి..
● మహారాష్ట్రలో పనిచేస్తున్న 26
మందిని నాగర్‌కర్నూల్ జిల్లాకు తరలింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: బతుకుదెరువు కోసం వలసజీవిగా మహారాష్ట్రకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అక్కడి అధికారులు విముక్తి కల్పించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన 26 మంది మహారాష్ట్రలోని పర్బాణీ జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం కూలీలుగా పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో రోజంతా పనిచేయించుకుంటూ, ఇక్కట్లకు గురిచేస్తుండటంతో స్థానిక అధికారులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన అధికారులు బాండెడ్ లేబర్‌గా గుర్తించి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాకు తరలించారు. నాగర్‌కర్నూల్, తెలకపల్లి, బిజినేపల్లి, కోడేరు, అచ్చంపేట మండలాలకు చెందిన మొత్తం 26 మందిని నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఫౌండేషన్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్‌మెంట్(ఎఫ్‌ఎస్‌డీ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారి స్వస్థలాలకు తరలించారు. రోజుకు 200 మాత్రమే కూలీ ఇస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయించారని, అనారోగ్యం బారిన పడినా తమను పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.


