మహిళలకు తీపి కబురు
● గ్రూపు సభ్యులకు వడ్డీలేని రుణాలు
● పుర ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాల మీద పంపిణీ
జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి రూ.కోట్ల మేర వీఎల్‌ఆర్ నిధులు మంజూరయ్యాయి. వీటిని మహిళా గ్రూపు సభ్యులకు పంపిణీ చేశాం. ఈ రుణాలను గ్రూపు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కొల్లాపూర్‌లో 10 వేల చీరలు సైతం పంపిణీ చేశాం.
– శ్వేత, మెప్మా డీఎంసీ
అచ్చంపేట: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మినహా మూడు మున్సిపాలిటీల పరిధిలో రెండేళ్లకు సంబంధించిన వడ్డీలేని రుణాలను (వీఎల్‌ఆర్)ను మంజూరు చేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో మొత్తం 1,881 గ్రూపులు ఉన్నాయి. వీటికి మూడేళ్లుగా వీఎల్‌ఆర్ రుణాలు అందలేదు. ఫలితంగా గ్రూపు సభ్యులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలకు వీఎల్‌ఆర్ రుణాలు పంపిణీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వీఎల్‌ఆర్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు 2023–24, 2024– 25కు సంబంధించి జిల్లాకు రూ.1,23,95,378 మేర నిధులు విడుదలయ్యాయి. ఇటీవల నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతులమీదుగా మంజూరుకు సంబంధించిన చెక్కులు మహిళలకు అందజేశారు. ఈ నెల 19న నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అదేరోజు కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్‌లో ఈ నెల 22న ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చీరలను సైతం అందజేశారు. కొల్లాపూర్‌లో 10వేల చీరలను మహిళలకు పంపిణీ చేయగా.. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ఇంకా మంజూరు కాలేదు. స్టాక్ వచ్చిన తర్వాత చీరలు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో మహిళా సంఘాలకు వీఎల్‌ఆర్ నిధులు ఇలా..
మున్సిపాలిటీ వడ్డీ తీసుకున్న వచ్చిన నిధులు
ఎస్‌హెచ్‌జీలు (రూ.కోట్లలో)
నాగర్‌కర్నూల్ 245 70,80,324
కల్వకుర్తి 267 1,05,99,143
కొల్లాపూర్ 153 47,15,912


