యూరియా వాడకం డబుల్‌ | - | Sakshi
Sakshi News home page

యూరియా వాడకం డబుల్‌

Jan 21 2026 7:26 AM | Updated on Jan 21 2026 7:26 AM

యూరియ

యూరియా వాడకం డబుల్‌

జిల్లాలో మోతాదుకు మించి వినియోగిస్తున్న రైతులు

ఎకరానికి నాలుగు

బస్తాలకుపైనే పిచికారీ

యాప్‌ ద్వారా బుకింగ్‌

విధానంతోనైనా అడ్డుకట్ట పడేనా..?

అచ్చంపేట: జిల్లా రైతాంగం మోతాదుకు మించి యూరియా వాడుతోంది. వరి ఏపుగా రావడం లేదని చెప్పి కొందరు ఎకరానికి నాలుగు బస్తాల దాకా వాడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అంచనాలు తారుమారై కొరత ఏర్పడుతోంది. మరోవైపు రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్‌ నుంచి సొసైటీల ద్వారా కార్డుల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నా.. రైతుల్లో మార్పు రావడం లేదు. యాప్‌తోనైనా సమస్య తీరుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది.

వాడాల్సింది రెండు బస్తాలే..

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 5,95,117.64 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 1,79,303 ఎకరాల్లో వరి సాగు చేశారు. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 2,52,425 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 47,464 ఎకరాల్లో వరి, 99,407 ఎకరాల్లో మొక్కజొన్న, 95,848 ఎకరాల్లో వేరుశనగ, 8,718 ఎకరాల్లో మినుములు, 677 ఎకరాల్లో జొన్న, 311 ఎకరాల్లో ఆముదం సాగైంది. అయితే జిల్లా పరిస్థితులు, భూముల తీరును బట్టి ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా వాడితే సరిపోతుంది. అది కూడా రెండు లేదా మూడు విడతల్లో పంటకు పిచికారి చేయాల్సి ఉంటుంది. మొదట నాటు వేసిన 15 రోజులకు ఎకరాకు ఒక బస్తా, తిరిగి 45 రోజులకు చివర పొట్ట దశలో ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి అందించాలి. లేదంటే 45 రోజులకు ఒకేసారి బస్తా యూరియా పిచికారి చేసినా సరిపోతుంది. ఈ లెక్కన యూరియాను పంటకు అందిస్తే నత్రజని సకాలంలో సమృద్ధిగా అంది పంట దిగుబడి పెంపునకు తోడ్పడుతుంది.

యాప్‌ బుకింగ్‌ ద్వారా..

జిల్లాలో రైతులు మోతాదుకు మించి యూరియా వాడడంతో అధికారుల అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఈ పరిస్థితుల వల్లే వానాకాలం సీజన్‌లో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా పాస్‌ పుస్తకాలున్న రైతులకే ఇస్తున్నారు. అధికంగా యూరియా వాడే రైతులు ప్రైవేట్‌ డీలర్ల వద్ద యూరియా పొంది.. తిరిగి పీఏసీఎస్‌ల వద్ద మళ్లీ తీసుకుంటున్నారు. ఇలా అధిక బస్తాలను పొంది వరి పంటకు అందిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూప్‌ బుకింగ్‌ విధానం విజయవంతమైతే విచ్చలవిడిగా యూరియా వాడకానికి చెక్‌ పెట్టినట్లు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అచ్చంపేట శివారులో సాగు చేసిన వేరుశనగ పంట

మొదట్లోనే ఇష్టానుసారంగా..

వరి త్వరగా పచ్చబడి.. ఏపుగా పెరగాలని కొందరు రైతులు నాటుకు ముందే ఎకరానికి ఆర బస్తా వరకు యూరియా చల్లుతున్నారు. తదనంతరం 15 రోజులకు రెండు బస్తాల లెక్కన వేస్తున్నారు. అయితే చలికాలంలో వరి అంతగా పెరగదు. అగ్గి తెగులుకూ అవకాశం ఉంటుంది. జింక్‌ లోపం తల్తెతుతోంది. కానీ, రైతులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నివారణ చర్యలు తీసుకోకుండానే వరి పైరు పెరగడం లేదనే ఉద్దేశంతో యూరియాను మోతాదుకు మించి వాడుతుంటారు. రెండో దఫాలోనూ ఇదే విధంగా ఎకరానికి రెండు బస్తాల వరకు వినియోగిస్తున్నారు.

సూచనలు పాటించాలి..

జిల్లాలో యూరియా కొరత లేదు. వరి పంటకు మోతాదుకు మించి యూరియా వాడొద్దు. ఇలా వాడితే రైతులే నష్టపోతారు. రానున్న రోజుల్లో భూమి సారం కోల్పోతుంది. పంటలకు చీడపీడలు ఆశించి దిగుబడి తగ్గుతుంది. పెట్టుబడులు సైతం పెరుగుతాయి. కాబట్టి రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలి.

– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

యూరియా వాడకం డబుల్‌ 1
1/1

యూరియా వాడకం డబుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement