మంగపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే సమయంలో దళారులు దోచుకుంటున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామమైన అకినేపల్లిమల్లారం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని టీకొత్తగూడెం, జానంపేట, దుగినేపల్లి, రాజుపేట గ్రామాలకు చెందిన సుమారు 250 మందికిపైగా రైతులు గురువారం అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా గ్రామాల్లో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ షాపుల నిర్వాహకులు, ధాన్యం కొనుగోళ్ల వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి మంచి ధర ఉండడంతో కొందరు వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రైతులు వాపోయారు. వ్యాపారుల వలలో పడి నష్టపోకుండా రైతులందరూ సమష్టిగా ఎదుర్కొనేందుకు సంఘటితం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో కార్యాచరణ రూపొందించి అమలు చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతుల సమావేశానికి ఆయా గ్రామాలకు చెందిన పలువురు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం హాజరయ్యారు. రైతులకు మేలు చేకూరేలా తీసుకునే నిర్ణయాలకు తామంతా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని హామీనిచ్చారు.
అడ్డుకట్ట వేసేందుకు సమష్టి నిర్ణయం


