● రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
ములుగు: మోడల్ బస్టాండ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క గురువారం జిల్లా కేంద్రంలోని మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, నిర్మాణ పనులతో పాటు ఇతర పనుల పురోగతిని పరిశీలించి పనుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనులను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, విద్యుద్ధీపాలతో పాటు మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భైరెడ్డి భగవాన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


