ములుగు: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ప్రజలు జమ్మి చెట్టును పూజించి ఆకులను పరస్పరం పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. స్నేహితులు, బంధువులను కలుసుకుని పండుగ ఆనందాలను పంచుకున్నారు. అనంతరం ప్రజలు కొత్త పనులు ప్రారంభించేందుకు ఆసక్తి చూపారు.
ధర్మజాగరణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ వధ
విజయదశమి సందర్భంగా ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని సాధన ఉన్నత పాఠశాల సమీపంలో రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి అఖిల భారత ప్రచార ప్రముఖ్ లింగం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భరతమాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావణ వధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు హాజరు కాగా బాణసంచా విన్యాసాలు, మిమిక్రీ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. రావణాసురుడు అపారమైన జ్ఞానం, శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ అధర్మ మార్గంలో నడవడం వల్ల పతనమయ్యాడని వివరించారు. విజయదశమి అధర్మంపై ధర్మం గెలిచినందుకు ప్రతీక అని వెల్లడించారు. దసరాను కేవలం వేడుకగా కాకుండా శ్రీరాముడి ధర్మాన్ని జీవితంలో ఆచరించే పండుగగా భావించాలని సూచించారు. విద్య అంటే కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదన మాత్రమే కాదని.. దేశానికి, సమాజానికి ఉపయోగపడే పౌరులను తీర్చిదిద్దడమే నిజమైన లక్ష్యమని తెలిపారు. పిల్లల సందేహాలను నివృత్తి చేస్తూ వారిలో ఆలోచనా శక్తిని పెంపొందించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాలు నేర్పే ధర్మం, త్యాగం, కుటుంబ అనుబంధం, బాధ్యత వంటి విలువలను బాల్యం నుంచే పిల్లలకు తెలియజేయాలన్నారు.
దసరా వేడుకల్లో మంత్రి సీతక్క
ములుగు రూరల్: మండల పరిధిలోని జగ్గన్నపేట గ్రామంలో నిర్వహించిన దసరా వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి బొడ్రాయి వద్ద ఉన్న జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం గ్రామస్తులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు


