ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు బుధవారం వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల రామప్ప చెరువు, డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీటి నిల్వ ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి సమీప చెరువులు, పరిసర ప్రాంతాల కుంటలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయకుండా సమష్టిగా ఎదుర్కోవాలని సీతక్క సూచించారు. రామప్ప–లక్నవరం కాలువతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


