పెండింగ్‌ వినతులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వినతులు పరిష్కరించాలి

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

ములుగు రూరల్‌: ప్రజావాణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాసులను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 2, ఇతర శాఖలకు సంబంధించి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా వచ్చిన నాలుగు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు బదలాయించినట్లు అధికారులు వివరించారు.

మోస్ట్‌ ప్రామీసింగ్‌ రీసెర్చర్‌ అవార్డుకు సతీష్‌ ఎంపిక

ములుగు: జిల్లా కేంద్రానికి చెందిన కేన్‌ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ, వృక్షశాస్త్ర నిపుణులు డాక్టర్‌ సుతారి సతీష్‌ ప్రతిష్టాత్మకమైన మోస్ట్‌ ప్రామీసింగ్‌ రీసెర్చర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. సైంటిఫిక్‌ లారెల్స్‌ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, పరిశోధన రంగంలో చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించిందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 55 పరిశోధనా పత్రాలు ప్రచురించి, 18 పుస్తకాలు రాయడంలో భాగస్వామ్యం కావడమే కాక, తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాల నుంచి 15 జాతుల కొత్తమొక్కలను పరిశోధనా రంగానికి పరిచయం చేసినట్లు వెల్లడించారు.

పాలపిట్టను బంధిస్తే నేరం

ఏటూరునాగారం: పాలపిట్టను బంధిస్తే నేరమని ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ రహమాన్‌ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని నాయకులు, ప్రజలతో ప్రత్యేకంగా ముద్రించిన వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి ప్రచారాన్ని చేపట్టారు. వాల్‌పోస్టర్లను బస్టాండ్‌, మార్కెట్‌, ప్రధాన కూడళ్లలో గోడలకు అతికించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. వన్యప్రాణులు, పక్షులను కాపాడుకోవాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన కవిత ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. కవితకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణ, చిన్నారుల టీకాల కార్యక్రమాల్లో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏటా ఐదు శాతం వేతనాలు పెంచాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా పెంపు లేకపోవడం అన్యాయమని విమర్శించారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణతోపాటు వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, కార్యదర్శి మధుబాబు, ఉపాధ్యక్షుడు రఘురాం, కోశాధికారి శ్రీను, కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement