ములుగు: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలు మంగళవారం జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దసరా పండుగను పురస్కరించుకొని పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు, జమ్మి పూజలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ ఎదుట మంగళవారం రాత్రి నిర్వహించనున్న రావణవధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కను ధర్మ జాగరణ సమితి సభ్యులు ఆహ్వానించారు. సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ములుగులో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే రావణాసుర వధ కార్యక్రమం గొప్పదన్నారు. ధర్మ పరిరక్షణకు ధర్మ జాగరణ సమితి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో యువతలో ధార్మిక చైతన్యం, దేశభక్తి పెంపొందుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో గండ్రకోట కుమార్, రాజేందర్ గౌడ్, సుధాకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో సాధన స్కూల్ ఎదుట రావణవధ..
మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక
అందజేసిన ధర్మజాగరణ కమిటీ


