మల్హర్(కాటారం): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి లభ్యత, విద్యుత్ వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజలందరూ నీరు, విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. సోమవారం ధన్వాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. రాష్ట్రానికి కావాల్సిన తాగునీరు 400 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200 టీఎంసీలే ఉందన్నారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రబీ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. సర్పంచ్‌లు, రైతు సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అన్ని పథకాలను పూర్తిచేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను బలోపేతం చేస్తూ పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. మంథని నియోజకవర్గంలో మహిళలకు కుట్టు శిక్షణ, గార్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు


