ములుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆడిపాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా మన పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి సీతక్క
కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు


