శ్రీభద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

శ్రీభద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయానికి రెండేళ్లకాలానికి 11మంది సభ్యులతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయంనుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయగా 2014 వరకు కొనసాగింది. అనంతరం 11 ఏళ్లుగా పాలకమండలి లేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ 2025, జూన్‌11న ఏడాదికాలానికి వంశపారంపర్యేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. తాజాగా పూర్తిస్థాయి నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. మండలిలో కమటం వేణుగోపాల్‌, కల్లూరి పవన్‌కుమార్‌, కటకం రాములు, కరేంగుల సురేష్‌బాబు, గదే శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, చిదర అంజనీ, మాడిశెట్టి సతీష్‌, పేరాల శ్రీనివాస్‌రావు, రమేష్‌ చంద్‌ బ్యాంగ్‌, చింతలపాని వాసవీరెడ్డి, మోత్కూరి మయూరీలు సభ్యులుగా ఉన్నారు. ధర్మకర్తలు ప్రమాణస్వీకారం చేసిన తేదీనుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

మైన్స్‌శాఖలో పదోన్నతులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో పదోన్నతులు, పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ప్యానల్‌ సంవత్సరానికి సంబంధించి ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లకు డిప్యూటీ డైరెక్టర్లుగా తాత్కాలికంగా పదోన్నతి కల్పించింది. అందులో బి.గోవిందరాజును వరంగల్‌లోని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యాలయంలో పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ జీఓ ఆర్టీ నంబర్‌ 185 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్‌ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న జయరాజుపై ఆగస్టు 27న ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ దాడులు జరిపిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్‌కు గురికాగా, వనపర్తి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా ఉన్న బి.గోవిందరాజును ఇన్‌చార్జ్‌ డీడీగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర, సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలు – 1996లోని రూల్‌ 10(ఏ) ప్రకారం కల్పించిన పదోన్నతుల్లో భాగంగా పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.

సీసీ రోడ్డు పనులు

ప్రారంభం

ములుగు రూరల్‌: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్‌లాల్‌పల్లి నుంచి జీవింతరావుపల్లి వరకు సీసీ రోడ్డు పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం రోడ్డు పనులకు కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.8.50కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల భిక్షపతి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, కౌన్సిలర్లు ఆలోత్‌ పద్మ, ఓంప్రకాశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌, చాంద్‌పాషా, వంశీ, అభినయ్‌, రాకేశ్‌, సమ్మయ్య, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వాలి

గోవిందరావుపేట: మారుమూల గ్రామాల్లో పేదలకు ప్రథమ చికిత్స అందిస్తున్న అర్హులైన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించాలని యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జన్నారపు రమేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదరణ గ్రామీణ వైద్యుల మండల అధ్యక్షుడు బొబ్బ మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నూతన జిల్లా అధ్యక్షుడు జన్నారపు రమేశ్‌ను ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ వైద్య సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఎంతో శ్రమించి పేదలకు ప్రథమ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇచ్చి జీవనోపాధికి కల్పించే చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. అనంతరం ప్రభుత్వాలు మారుతున్నా ఈ వ్యవస్థ ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement