ములుగు: జనగణన–2027 రెండో దశ జనాభా గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) సీహెచ్. మహేందర్‌జీ సూచించారు. జనగణన విధుల్లో భాగంగా ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు బుధవారం నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకొని, జనగణన వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో కాగితాలపై నమోదు చేసిన జనగణన వివరాలను ఈసారి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సేకరించనున్నందున సంబంధిత సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకురాలు మంజుల, ములుగు ముఖ్య ప్రణాళిక అధికారి, కార్యాలయ గణాంక అధికారి భూక్య లాల్‌నాయక్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను జిల్లా అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అలాంటి బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ


