ములుగు: విద్యుత్ కోతలను నివారించి.. రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ములుగులో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. వెంకటాపురం(ఎం) మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, నాయకుడు మల్క రమేశ్ ఆధ్వర్యంలో పాలంపేట– పరకాల రహదారిౖపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సబ్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నాయకులు విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. లోవోల్టేజీ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మోటార్లు కాలిపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల ధర్నా


