● వన్యప్రాణుల రక్షణలో భాగంగా పిచ్చిమొక్కల తొలగింపు
● జిల్లాలో 48 కిలోమీటర్ల మేర పనులు
ఏటూరునాగారం: జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాలున్నాయి. 163 జాతీయ రహదారి వెంట ఉన్న ప్రధాన రోడ్డుకు ఇరువైపుల ఉన్న తుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించి ప్రమాదాలు జరగకుండా వ్యూలైన్స్ పనులకు అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు వెంట తుప్పలు, పిచ్చిమొక్కలు ఉండడంతో రోడ్డు చివరి అంచు ఎక్కడి వరకు ఉందనేది అర్థం కాకుండా పోతుంది. అలాగే ఆ తుప్పల నుంచి జంతువులు వచ్చేది కూడా వాహనదారులకు కనిపించకుండా పోతాయి. జంతువుల రక్షణకు, వాహనాల ప్రమాదాల నివారణకు వ్యూలైన్స్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ ఏడాది సుమారుగా 48 కిలోమీటర్ల వ్యూ లైన్ చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జింకలు, దుప్పులు, అడవి బర్రెలు ఇలా అనేక వన్యప్రాణులు ప్రధాన రోడ్ల మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో అవి వాహనదారులకు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో వ్యూ లైన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అటవీశాఖ సౌత్ ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కూలీలతో పిచ్చి మొక్కలను తొలగించామని, వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యతనన్నారు.


