● తొలిరోజు బాల త్రిపుర
సుందరీదేవిగా దర్శనం
ములుగు: జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రామాల్లోని ఆలయాలు, మండపాల్లో అమ్మవారు కొలువుదీరగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారిని ప్రతిష్టించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయాలను, ప్రత్యేక మండపాలను విద్యుద్ధీపాలు, పుష్పాలతో అలంకరించారు. మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.


