వాజేడు: మండల కేంద్రంలోని దుర్గామాత అమ్మవారి ఆలయం వద్ద గురువారం పసుపు కొట్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గా నవరాత్రులు త్వరలో ప్రారంభం కానుండటంతో అందులో భాగంగా ముందస్తుగా గ్రామంలోని మహిళలతో ఆలయ నిర్వాహకులు పసుపు కొట్టం కార్యక్రమం చేపట్టారు.
మంగపేట : మండలంలోని కమలాపురంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమమ్మ సంబురాలు గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యా యి. మహిళలు, యువతులు, చిన్నారులు పీటపై బొడ్డెమ్మను తయారు చేసి ఆడిపాడారు. తెలంగాణలోని ఆయా ప్రాంతాలను బట్టి ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు 05 నుంచి 02 రోజల ముందు నుంచి జరుపుకొవడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా బోరునర్సాపురం, రాజుపేట తదితర గ్రామాల్లో బొడ్డెమ్మ సందడి నెలకొంది.
ములుగు రూరల్: కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వాల్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ మల్లేశం అన్నారు. గురువారం క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 7వరకు నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి క్రీడలు కిడ్స్ కళాశాలలో నిర్వహించారని అన్నారు. వాలీబాల్‌లో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ సర్కిల్ పరిధిలో బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, నిర్వాహకులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ నల్ల వెంకటేశ్వర్లు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ పండుగకు ముందుగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో రాకపోకలకు అంతరాయం కలిగించరాదని, మద్యం తాగి అల్లర్లు, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడకుండా చూడాలని సూచించారు. డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగంలో శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలన్నారు. బాణసంచా కాల్చేటప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని సీఐ సూచించారు.
చిట్యాల: విద్యార్థులు డ్రగ్స్, సైబర్‌నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పోచంపల్లి సతీశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్, సైబర్‌నేరాల వంటి వ్యసనాల బారిన పడి మీ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని అన్నారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కోరారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామానికి చెందిన మహ్మద్ రహీం ఇటీవల మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను సర్పంచ్ బుర్ర చంద్రకళ రవీందర్ గురువారం పరామర్శించి రూ.2వేలు నగదు, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నునావత్ సమ్మయ్య, వార్డు సభ్యులు మోరే ఒదేలు, బొమ్మ నవీన్, అజ్మీర రమేష్, సుంచు మహేష్, మేడిపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


