ఎస్‌ఎస్‌తాడ్వాయి: హనుమకొండ నుంచి పస్రా ఏటూరునాగారం మీదుగా మంగపేట వరకు ఇసుక లారీల రాకపోకలు పెరగడంతో రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఇసుక రవాణా లారీలు నిత్యం పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే కొందరు లారీ డ్రైవర్లు వేగ పరిమితులను పట్టించుకోకుండా అతివేగంగా వాహనాలను నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గమ్యస్థానానికి ముందుగా చేరుకోవాలనే ఉద్దేశంతో లారీ డ్రైవర్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ వాహనాలను వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. పస్రా–ఏటూరునాగారం మార్గంలో ఇసుక లారీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటి వేగ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లారీలు ఎదురుగా వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించే వారు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాహనాదారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో లారీలు ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటున్నారు. భారీ వాహనాలు కావడంతో వాటిని అదుపు చేయడం కష్టమవుతుందని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే చిన్న వాహనాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.
ప్రమాదం జరిగినా.. చర్యలు ఏవి?
రహదారిపై ద్విచక్ర వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. అదే సమయంలో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కూడా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లారీల ఫిట్‌నెస్, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వేగ పరిమితులు, రవాణా నిబంధనల అమలుపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పస్రా నుంచి ఏటూరునాగారం రహదారిపై ఇసుక లారీల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపట్టడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించే లారీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పస్రా– తాడ్వాయి మార్గంలో గురువారం జరిగిన లారీ ప్రమాద ఘటనతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది.
పగలు రాత్రి కొనసాగుతున్న బెల్ట్‌షాపుల నిర్వహణ
పగలు, రాత్రి అనే తేడా లేకుండా తెల్లవారుజామున వరకు బెల్ట్‌షాపులు తెరిచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఇసుక లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి లారీలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బెల్ట్‌షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లోనూ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక లారీలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పర్యవేక్షణ పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భయాందోళనలో వాహనదారులు
పట్టించుకోని అధికారులు


