మంగపేట: మండల కేంద్రంలోని పాత బస్టాప్ వరకు ఆర్టీసీ బస్సుల రాక పోకలను పునరుద్దరించాలని వర్తక సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో, పంచాయతీ కార్యదర్శి మురళికి వినత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి మండల కేంద్రంలోని పాత బస్టాప్ వరకు వచ్చి పోయే ఆర్టీసీ బస్సులు కొద్ది నెలల నుంచి లోపలికి రాకుండానే ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. విషయంపై తాము ఆర్టీసీ అధికారులను సంప్రదించామన్నారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం నుంచి పాత బస్టాప్ వరకు మధ్యలో ఇరుకుగా ఉన్న ప్రధాన రోడ్డుకు ఇరువైపులా షాపుల ముందు వాహనాలు పార్కింగ్ చేయడం, కొందరు రోడ్డును ఆక్రమణ చేయడం, విద్యుత్ వైర్ల సమస్య కారణంగా ఆర్టీసీ బస్సులు మండల కేంద్రంలోనికి వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దీని కారణంగా బస్సులు లోపలికి రావడంలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారన్నారు. కేశవరావు, శిద్ధంశెట్టి వెంకటేశ్వర్లు, సయ్యద్ హుస్సేన్, క్రిష్ణారెడ్డి, నర్రా శివప్రసాద్, వడ్ల కొండ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు నెల వారీ చిట్టీలు, రోజువారి గిగి గిరి నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాల్సిన సమయంలో ఆఫీస్ వర్క్ పేరుతో వారి సొంత పనులపై బయటకు వెళ్తున్నారని ఆరోపించారు. చిట్టీలు, గిరి గిరి వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నరనే ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


