రూ.49.43కోట్లతో.. మాస్టర్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.49.43కోట్లతో.. మాస్టర్‌ ప్లాన్‌

Oct 8 2026 1:18 AM | Updated on Oct 8 2026 1:18 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఇకపై ఇబ్బందులు కలగకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. 2028లో వచ్చే మహాజాతరను దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ శాఖ రంగంలోకి దిగి మేడారం, పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు, జంపన్నవాగు తీర ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. భక్తుల సౌకర్యంతో పాటు పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా మొత్తం రూ.49.43 కోట్లతో నాలుగు ప్రధాన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులు ఇటీవల ప్రభుత్వానికి పంపారు.

జంపన్నవాగుకు కొత్త రూపు

మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. జాతర సమయంలో లక్షలాది మంది ఒకేసారి వాగు వద్దకు చేరుకోవడంతో రద్దీ, భద్రత, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నీటి ప్రవాహం, వాగు తీరం, స్నానాలకు అనువైన ప్రాంతాల కొరతతో భక్తులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఇరిగేషన్‌ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఊరట్టం కాజ్‌వేకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో జంపన్నవాగు ఎడమ వైపున సుమారు 900 మీటర్ల పొడవున ఆధునిక స్నానఘట్టాలు నిర్మించేందుకు రూ.21.25 కోట్లతో ప్రతిపాదించారు. అలాగే జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ప్రణాళిక రూపొందించారు. వాగుకు అడ్డంగా రూ.14.78 కోట్లతో చెక్‌డ్యామ్‌ నిర్మించనున్నారు. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేయడంతో పాటు ఎండాకాలంలోనూ వాగులో నీటి నిల్వ ఉండేలా పనులు చేపట్టనున్నారు.

రావి చెరువు.. శివరామ్‌ సాగర్‌కు కొత్త హంగులు

మేడారంలోని రావి చెరువుకు కూడా మహర్దశ రానుంది. ప్రస్తుతం ఉన్న చెరువును సుందరీకరించి రూ.5.80 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు అనువుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు. అలాగే శివరామ్‌ సాగర్‌ చెరువును సైతం అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నారు. ఇందుకోసం రూ.7.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండు చెరువుల అభివృద్ధి పనులు పూర్తయితే మేడారంలో పర్యాటకులను మరింత ఆకర్షించనున్నాయి.

అనుమతి రాగానే టెండర్లు

ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి నిధులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో అనుకున్న సమయానికి పనులు పూర్తయితే జాతర సమయంలో భక్తులకు ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. జంపన్నవాగులో సురక్షిత స్నానఘట్టాలు, నీటి నిల్వ కోసం చెక్‌డ్యామ్‌, రెండు చెరువుల సుందరీకరణతో మేడారం రూపురేఖలు మారే అవకాశం ఉంది. మరోవైపు మేడారం కేవలం జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు, పర్యాటకులు సందర్శించే అవకాశం ఉంది.

మహాజాతరలో గద్దెల ప్రాంగణంలో భక్తులు(ఫైల్‌)

మేడారంలో ఇరిగేషన్‌శాఖ

ఆధ్వర్యంలో ప్రణాళిక

జంపన్నవాగులో 900 మీటర్ల మేర

ఆధునిక స్నానఘట్టాలు

రూ.14.78 కోట్లతో చెక్‌డ్యామ్‌ నిర్మాణం

2028 మహాజాతరే లక్ష్యంగా

ముందుకు..

ప్రభుత్వ పరిపాలనా అనుమతుల

కోసం ఎదురుచూపు

2028 జాతరే లక్ష్యం

2028లో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో పనులు చేపట్టకుండా ఇప్పటి నుంచే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రాబోయే మహా జాతర నాటికే వీలైనంత వరకు కీలక పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మినీ మేడారం వచ్చే భక్తులకు సైతం మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement