మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా మాధవి | - | Sakshi
Sakshi News home page

మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా మాధవి

Oct 8 2026 1:18 AM | Updated on Oct 8 2026 1:18 AM

ములుగు రూరల్‌: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా జిల్లా కేంద్రానికి చెందిన గాదం మాధవిని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ తన ఎన్నికకకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్‌లాల్‌, కృష్ణవేణి నాయక్‌, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

అసిస్టెంట్‌ కమాండెంట్‌గా అరుణ్‌ రాజ్‌కుమార్‌

గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి 5వ బెటాలియన్‌ టీజీఎస్పీ నూతన అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఆర్‌.అరుణ్‌ రాజ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అలైడ్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహించిన ఆయన బెటాలియన్‌కు అసిస్టెంట్‌ కమాండెంట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బెటాలియన్‌ కమాండెంట్‌ సీవీ.లక్ష్మీకాంతరావు నూతన అసిస్టెంట్‌ కమాండెంట్‌కు మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బెటాలియన్‌ విధుల నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తూ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం అరుణ్‌ రాజ్‌కుమార్‌ బెటాలియన్‌ అఽధికారులను పరిచయం చేసుకున్నారు.

బూర్గుపేట

ఆశ్రమ పాఠశాల తనిఖీ

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని బూర్గుపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యా పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించిన పీఓ విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయి, విద్యాప్రగతిని తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, బోధనకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని డార్మెంటరీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఆస్పత్రి సిబ్బందికి

రక్షణ ఏది?

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని వైద్యసిబ్బంది ఆస్పత్రి ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేషెంట్లు, వారి అటెండర్లు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నా.. భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆస్పత్రిలో భద్రతా ఏర్పాట్లు సక్రమంగా లేవని, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను తొలగించి, సమర్థవంతమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లు, అటెండర్ల కదలికలపై నిఘా పెంచడంతోపాటు సిబ్బందిపై దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరారు. సిబ్బందికి పూర్తి భద్రత కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement