ములుగు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం వాడీవేడిగా సాగింది. పనుల కేటాయింపు, దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాల ఖర్చులపై పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నలు లేవనెత్తారు. నర్సంపేటకు చెందిన విశ్వం సౌండ్ సంస్థకు సుమారు రూ.11 లక్షల పనిని నామినేటెడ్ పద్ధతిలో కేటాయించడంపై టెండర్ ప్రక్రియ ఎందుకు చేపట్టలేదని మున్సిపల్ కమిషనర్ సంపత్‌ను ప్రశ్నించారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు రూ.11 లక్షల వ్యయం ప్రతిపాదించడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలోని వీధి దీపాలు, పైపులైన్ల లీకేజీలు, గల్లీల్లో మొరం, జేసీబీ మరమ్మతులు, చెత్త ట్రాక్టర్ల డీజిల్ వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా ఉత్సవాలకు ఇంత మొత్తం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కౌన్సిలర్లు గోనెల భరత్, బైకాని సునీతఓదేలు, వేణుగోపాల్‌చారి, పద్మ, గండ్రకోట వాణికుమార్, కొయిల లక్ష్మీ, బైకాని అనూషసాగర్ ప్రశ్నించడంతో సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
రూ.11 లక్షల పనుల కేటాయింపుపై అభ్యంతరాలు


