ఎస్‌ఎస్ తాడ్వాయి: విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిధిలోని బయ్యక్కపేటలోని గిరిజన సంక్షేమ ప్రాథమికోన్నత పాఠశాల(ఏయూపీఎస్ )ను ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం సందర్శించి పాఠశాలలోని విద్యా పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల నోట్‌బుక్స్, అభ్యసన స్థాయి, విద్యా ప్రగతిని పరిశీలించారు. పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతా వరణం కల్పించేలా పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ప్రణాళికతో సాధన చేసి ఉద్యోగాలు సాధించాలి
ఏటూరునాగారం: పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ప్రణాళికతో సాధన చేసి ఉద్యోగాలు సాధించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, ఏఎస్పీ మనన్‌భట్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవనంలో గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా ఇస్తున్న శిక్షణను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న గిరిజన అభ్యర్థులతో పీఓ మాట్లాడారు. శిక్షణలో సౌకర్యాలు, వసతి, భోజనం, విద్యా, శిక్షణ వంటి తదితర అంశాలను వారు పరిశీలించి అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణకు వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్థుల శారీరక దారుఢ్య శిక్షణ, ఫిజికల్ యాక్టివిటీస్ కోసం కొమురం భీం స్టేడియాన్ని వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ జీడీ సూర్యప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


