మల్లెతోటలో కలుపు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

మల్లెతోటలో కలుపు తొలగింపు

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

ఏటూరునాగారం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలో ఏపుగా పెరిగిన కలుపును సోమవారం ఐటీడీఏ పరిధిలోని కూలీలు తొలగించారు. మల్లెతోటలో కలుపు పెరిగిందని ఉద్యానం.. అధ్వానం శీర్షికన గత నెల 30న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కూలీలు వెంటనే స్పందించి మల్లె తోటలోని కలుపుతీసి అవి పెరిగే విధంగా చర్యలు చేపట్టారు. వీటితో పాటు మిగతా మొక్కలను కూడా సంరక్షణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

బొగత వద్ద ప్లాస్టిక్‌ సేకరణ

వాజేడు: బొగత జలపాతం పరిసరాల్లో పడేసిన ప్లాస్టిక్‌ వస్తువులను అటవీ శాఖ, బొగత సిబ్బంది సంయుక్తంగా సేకరించారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా బొగత జలపాతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నివారించడంలో భాగంగా సోమవారం సేకరించారు. ఈ సందర్భంగా రేంజర్‌ నరేందర్‌ మాట్లాడుతూ జలపాతానికి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్‌ వస్తువులను వెంట తీసుకురావద్దని తెలిపారు. ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు నారాయణ, భిక్షపతి, చిన్నక్క, ఎఫ్‌బీఓ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌కు సౌరవిద్యుత్‌

అనుసంధానం

చిట్యాల: మండలకేంద్రంలోని 33/11కేవి సబ్‌స్టేషన్‌కు రెండు మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి అనుసంధానం చేసినట్లు భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ నాగెల్లి సదానందం పేర్కొన్నారు. సోమవారం చిట్యాల సబ్‌స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎం కుసుమ్‌ ఏ పథకం ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి మరో ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు సౌర విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా స్థానికంగా విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం మూలంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్‌ాధ్యన్ని మరింతగా పెంచుతూ, పర్యావరణహితమైన, స్థిరమైన విద్యుత్‌ ఉత్పత్తికి టీజీఎన్‌పీడీసీఎల్‌ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ జగదీశ్‌, ఏడీఈ పి.సుందర్‌కుమార్‌, ఏఈ చంద్రశేఖర్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రూ.12.58కోట్ల

నిధులు మంజూరు

మల్హర్‌(కాటారం): కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని అయిదు మండలాల్లో అభివద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భారీగా నిధులు మంజూరు చేయించారు. వీబీ జీ రామ్‌ జీ 2026–27 కింద రూ.12.58 కోట్లతో 115 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

కొత్తగా రూ.5.08 కోట్లు..

మల్హర్‌, మాహాముత్తారం మండలాల్లో ఆరు గ్రామ పంచాయతీ భవనాలకు రూ.1.20 కోట్లు (ఒక్కోటి రూ.20 లక్షలు), కాటారం, మహాముత్తారం, మహదేవపూర్‌, మల్హర్‌ మండలాల్లోని 24 అంగన్‌వాడీ భవనాలకు రూ.2.88 కోట్లు (ఒక్కోటి రూ.12 లక్షలు), మహాముత్తారం, మహదేవపూర్‌, పలిమెల మండలాల్లో 10 మహిళా సంఘ (వీఓ) భవనాలకు రూ.కోటి (ఒక్కోటి రూ.10 లక్షలు) మంజూరయ్యాయి. రెడ్డిపల్లి, ప్రేమ్‌ నగర్‌, రేగులగూడెం, ఇప్పలపల్లి, ఎడ్లపల్లి, నాచారం గ్రామాల్లో పంచాయతీ భవనాలు, కాటారం మండలంలోని మద్దులపల్లి, కాటారం, ఎర్రగుంటపల్లి తదితర 14గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement