ములుగు: చిన్నారులకు మంచి, చెడు స్పర్శ మధ్య తేడాను సులభంగా వివరించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమకూర్చిన ‘మాట్లాడే బొమ్మ’ను కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లో సోమవారం బొమ్మ పనితీరును పరిశీలించారు. బొమ్మ శరీర భాగాలను తాకినప్పుడు మంచి, చెడు స్పర్శ గురించి ఎలా వివరిస్తుందో బాలల పరిరక్షణ విభాగం అధికారులు చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు తమ భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మాట్లాడే బొమ్మను పాఠశాలల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో ఉపయోగించాలని సూచించారు. అసౌకర్యం కలిగించే స్పర్శ, వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేసేలా చిన్నారుల్లో ధైర్యాన్ని పెంపొందించాలన్నారు. క కార్యక్రమం అనంతరం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదురుగా ఉన్న బాలసదనాన్ని కలెక్టర్ సందర్శించారు. బాలికలకు కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న ఆహారం, విద్య, సంరక్షణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో ప్రవేశం పొందే బాలికల పరిస్థితులు, ప్రవేశ ప్రక్రియను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం చిన్నారులకు పౌష్టికాహార లడ్డూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, పరిరక్షణ అధికారి హరికృష్ణ, బాలసదనం పర్యవేక్షకురాలు శ్యామల, సిబ్బంది పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, మానవతా సేవలకు రెడ్ క్రాస్ సంస్థ చిరునామాగా నిలవాలని కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులు సోమవారం కలెక్టర్‌ను కలెక్టరేట్‌లోని కార్యాలయ గదిలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అల్లెం అప్పయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి సతీష్ కుమార్, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


