చిన్నారుల్లో పోషకాహార లోపం! | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల్లో పోషకాహార లోపం!

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

ములుగు: జిల్లాలో చిన్నారుల పోషకాహార పరిస్థితిపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఏఎఫ్‌హెచ్‌ఎస్‌–6) గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల్లో 35.8 శాతం మంది స్టంటింగ్‌ (వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం), 23.5 శాతం మంది వేస్టింగ్‌ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం), 39 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నట్లు 2023–24 జిల్లా గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా 6 నుంచి 23 నెలల వయసున్న చిన్నారుల్లో 25.1 శాతం మందికి మాత్రమే తగిన ఆహారం అందుతున్నట్లు సర్వేలో నమోదైంది.

టీకాల కవరేజీలో..

12–23 నెలల పిల్లల్లో పూర్తిస్థాయి టీకాలు పొందిన వారి శాతం 72.7 శాతంగా నమోదైంది. మూడు డోసుల పోలియో టీకాలు పొందిన వారు 75.5 శాతం, మూడు డోసుల పెంటావాలెంట్‌ టీకాలు పొందిన వారు 78.1 శాతంగా ఉన్నారు. మరోవైపు 9 నుంచి 35 నెలల పిల్లల్లో 96.6 శాతం మందికి విటమిన్‌ ఎ డోస్‌ అందినట్లు సర్వేలో తేలింది.

గర్భిణులకు వైద్యసేవలు మెరుగ్గానే..

గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో మెరుగైన వైద్యసేవలు నమోదయ్యాయి. తొలి త్రైమాసికంలో ప్రసవపూర్వ పరీక్షలు చేయించుకున్న తల్లులు 93.7 శాతం కాగా 98 శాతం మందికి కనీసం ఒక ప్రసవపూర్వ వైద్య సేవ అందింది. 89.2 శాతం మంది గర్భిణులు కనీసం 100 రోజులు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు తీసుకున్నారు. 64.8 శాతం మంది 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తీసుకున్నారు.

96.3 శాతం సంస్థాగత ప్రసవాలు

జిల్లాలో 96.3 శాతం ప్రసవాలు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు వంటి సంస్థాగత వైద్య సంస్థల్లో జరిగినట్లు సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఇందులో ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రసవాలు 74.9 శాతంగా ఉన్నాయి. శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో ప్రసవాలు 95.5 శాతం కాగా మొత్తం సిజేరియన్‌ ప్రసవాల వాటా 48 శాతంగా నమోదైంది.

87.1 శాతం కుటుంబాలకు ఆరోగ్య భద్రత

జిల్లాలో 87.1 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరికి ఆరోగ్య బీమా లేదా ఆర్థిక సహాయ పథకం కవరేజీ ఉన్నట్లు ఏఎఫ్‌హెచ్‌ఎస్‌–6 వెల్లడించింది. ఆరోగ్య సేవల విషయంలో ఇది కీలక సూచికగా నిలిచింది.

చక్కెర, బీపీ కూడా కలవరం

15 ఏళ్లు పైబడిన వారిలో రక్తంలో చక్కెర, అధిక రక్తపోటు సమస్యలు కూడా నమోదయ్యాయి. మహిళల్లో 21.7 శాతం, పురుషుల్లో 24.4 శాతం మందికి రక్తంలో చక్కెర అధికంగా ఉండటంతో మందులు వాడుతున్నట్లు తేలింది. అధిక రక్తపోటు లేదా బీపీ మందులు వాడుతున్న మహిళలు 23.1 శాతం, పురుషులు 26 శాతంగా నమోదయ్యారు.

పోషకాహారంపై మరింత దృష్టి అవసరం

మాతా–శిశు ఆరోగ్యానికి సంబంధించి ప్రసవపూర్వ వైద్యసేవలు, సంస్థాగత ప్రసవాలు వంటి అంశాల్లో గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ చిన్నారుల్లో ఎదుగుదల, బరువు, తగిన ఆహారం విషయంలో సవాళ్లు ఉన్నట్లు సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తొలి రెండేళ్లలో పిల్లలకు సమతుల్యమైన, వయసుకు తగిన ఆహారం అందేలా కుటుంబాలు, అంగన్‌న్‌వాడీలు, ఆరోగ్య శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏఎఫ్‌హెచ్‌ఎస్‌–6 జిల్లా గణాంకాల్లో

ఆందోళనకర అంశాలు

ఐదేళ్లలోపు 35.8 శాతం మందిలో

ఎదుగుదల లోపం

39 శాతం మంది తక్కువ బరువు

6–23 నెలల చిన్నారుల్లో 25.1శాతం మందికే తగిన ఆహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement