వెంకటాపురం(కె): ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన కూలీలకు అండగా ఉంటానని ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో పర్యటించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసిన తర్వాత అక్కడి కూలీలు జీవనోపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో మూడు రోజులు పర్యటించి ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో నివాసం ఉంటున్న వలస కూలీలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళకు అన్యాయం జరిగిన ఘటనలో తాను ఇక్కడకు వచ్చి వారిని అండగా నిలిచామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ వాసులకు ఏ సమస్యలు ఎదురైనా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్, చిడెంశివ, కిరణ్, కొండపర్తి సీతాదేవి, సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ సన్ని పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపు
ములుగు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు మామూనూర్ నవోదయ విద్యాలయం ఇన్‌న్‌చార్జ్ ప్రిన్సిపాల్ టి. రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతులు చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వీఐపీ ఘాట్ రోడ్డుపై
ఫెన్సింగ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు రోడ్డు కోసం సరస్వతీనది ఆది, అంత్య పుష్కరాల పనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, పంట నష్టం అందకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భూసేకరణ జరిగి ఏడాదిన్నర కావస్తున్నా నష్టపరిహారం, పంట నష్టం చెల్లింపులు పూర్తికాలేదని బాధిత రైతులు వాపోతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం లభించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన ముంగి బాపు అనే రైతు వీఐపీ ఘాట్ బీటీ రోడ్డుపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచాయి. పరిహారం చెల్లించిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు వాపోతున్నారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్లు, రహదారుల అభివృద్ధికి భూములు అవసరమవుతున్నందున అధికారులు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
బియ్యం దందా
ముఠా గుట్టురట్టు
భూపాలపల్లి: రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే ఓ ముఠాను భూపాలపల్లి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. భూపాలపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సంపత్‌రావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సీఆర్ నగర్‌కు చెందిన మోటం శ్రీనివాస్‌కు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన రైస్‌మిల్ యజమాని వీరయ్య సేటుతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయాలని అనుకున్నారు. మూడు నెలల క్రితం భూపాలపల్లి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. వారు లబ్ధిదారులనుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సిరొంచలోని వీరయ్య సేటు రైస్‌మిల్లుకు తరలించి విక్రయించారు. ఇందుకు గాను ఏజెంట్ల బ్యాంకు ఖాతాల్లో అతను డబ్బు వేస్తాడు. ఈ దందాకు శ్రీనివాస్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నందుకు ఏజెంట్లు తమకు వచ్చిన డబ్బులో నుంచి 10 శాతం కమీషన్ ఇస్తున్నారు.మూడునెలల్లో 3,400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు.


