ములుగు/గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ. గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం బుస్సాపూర్, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని మేడారం, వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాలంపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన శనివారం పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన గౌతమ్ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సాయం, బిల్లుల చెల్లింపు పరిస్థితిపై ఆరా తీశారు. నగదు సాయం సకాలంలో అందుతోందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయని లబ్ధిదారులు తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్‌కు చెందిన దివ్యాంగురాలు గండి కోమల హౌసింగ్ శాఖ కార్యదర్శి గౌతమ్‌ను కలిసి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. తనకు రెండు కాళ్లు లేవని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇల్లు మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా రావడం లేదని కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఆయన పరిశీలించి ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, హౌసింగ్ పీడీ కృష్ణప్రసాద్, తహసీల్దార్లు, ఏఈలు, సర్పంచులు పాల్గొన్నారు.
రామప్ప టెంపుల్.. వనదేవతల సందర్శన
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన అనంతరం రామప్ప దేవాలయాన్ని గౌతమ్ కుటుంబ సభ్యులతో సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని గైడ్ విజయ్ కుమార్ వివరించగా ఆసక్తిగా తిలకించారు. అలాగే మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను మేడారం సర్పంచ్ భారతి, సమ్మక్క– సారలమ్మ పూజారులు డోలి వాయిద్యాలతో గద్దెలపైకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజారులు గౌతమ్‌ను అమ్మవార్ల శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి
వీపీ.గౌతమ్
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ
పనుల పరిశీలన


