ఏటూరునాగారం: మిర్చి సాగు చేసే రైతులు సస్యరక్షణ పద్ధతులను పాటించి అధిక దిగుబడిని పెంచుకోవాలని ఏటూరునాగారం డివిజన్ ఉద్యాన అధికారిని కోపిరి లావణ్య సూచించారు. శనివారం ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి మిర్చి పంట సాగుపై రైతులకు ఆమె చేసిన సూచనలు.. బోదెల మధ్య, మొక్కకి మొక్కకి మధ్య 60 X 60 సెంటిమీటర్లు లేదా 76 X 60 సెంటిమీటర్లు లేదా 90 X 60 సెంటిమీటర్ల వెడల్పుతో నాటుకోవాలి. ఐదు అడుగుల దూరంలో లాటరల్ పైపులు పరిచినప్పుడు జంటసాళ్ల పద్ధతిలో లాటరల్ పైపుకి ఇరువైపులా 30 సెంటిమీటర్లు లేదా 40 సెంటిమీటర్ల దూరంలో రెండు వరుసల మధ్య దూరం 60 లేదా 70 సెంటీమీటర్ల దూరంలో మొక్కకి మొక్కకి మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి.
మల్చింగ్ విధానం..
కలుపు నివారణకు పోషకాల సద్వినియోగానికి డ్రిప్పుతో అనుసంధానించబడిన 25–30 మైక్రోన్‌ల మందంతో ఉన్న మల్చింగ్ షీటును బెడ్లపైన ప ర్చాలి. సూర్యరశ్మికి షీట్ మెరవడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిస్తుందని, దీనివల్ల 15 శాతం దిగుబడులు పెరుగుతాయని వివరించారు.
నీటి యాజమాన్యం..
మిరుప పంటకు డ్రిప్ విధానం చాలా దిగుబడి సహకరిస్తుంది. డ్రిప్ లాటరల్ పైపులను 120 నుంచి 150 సెంటిమీటర్ల దూరంలో పర్చాలి. డ్రిపర్లను 50 సెంటిమీటర్లకు 60 సెంటిమీటర్ల దూరంలో అమర్చితే నీటి సరఫరా సులభంగా ఉంటుంది. డ్రిప్ పద్ధతి అనుసరించుట ద్వారా నీరు, ఎరువులను ఆదా చేయడంతో పాటు అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. మిరుప పంట అధిక తేమను తట్టుకోలేదని, తేలిక నేలలో 8–10 రోజులకి ఒకసారి, రేగడి నేలలో 10–15 రోజులకు ఒకసారి నీరు పెట్టాలని, మిరుపకు పూత పిందె దశలో తప్పకుండా నీరు పెట్టాలని వెల్లడించారు.
ఎరువుల యాజమాన్యం..
ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువును కలియదున్నాలి. మిరుప పంటకు 120 కిలోల నత్రజని 24 కిలోల భాస్వరం 48 కిలోల పొటాష్ ఎరువులను దఫ దఫాలుగా వేస్తే అధిక, నాణ్యమైన దిగుబడి వస్తుంది. అధిక దిగుబడికి ఎకరానికి 50 కిలోల కాల్షియం అమోనియం నైట్రేట్ ఒకటి 1 లేదా 2 సార్లు పూత కాత దశలో వేయాలి. పూత పింద రాలకుండా పూత బాగా పట్టడానికి 2 ఎంఎల్ ప్లానోఫిక్స్, 10 లీటర్ల నీటిలో కలిపి పూత పిందె దశలో రెండు సార్లు పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించడానికి బోరాక్స్ 1 గ్రామ్‌ను ఒక లీటర్ నీటికి, జింక్ సల్ఫేట్ 2 గ్రామాలను ఒక లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే పోషక లోపాలు లేకుండా ఉంటాయని దీనివల్ల అధిక దిగుబడి వస్తుందని లావణ్య తెలిపారు.
మిర్చి రైతులకు
ఉద్యాన అధికారిని లావణ్య సూచనలు
మొక్కలు నాటే విధానం,
అధిక దిగుబడులపై అవగాహన


