హేమాచలుడికి పూజలు | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడికి పూజలు

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వందలాది మంది భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నా రు. పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వయంభు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు.

రామప్ప దేవాలయంలో అధికారులు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న గ్రూప్‌ 2 అధికారులు భారత్‌ దర్శన్‌లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ కుసుమ సూర్యకిరణ్‌, టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌లు ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అలాగే ఆర్కాలాజికల్‌ కన్సర్వేషన్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌, సూపరింటెండెంట్‌ నిఖిల్‌ దాస్‌ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు అభిషేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈఓ ఇమ్మడి భాస్కర్‌ వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఇటీవల పునరుద్ధరణ చేసిన సోమసూత్రం, ఆలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు.

గురుకుల కళాశాల

నుంచి ఇద్దరు బదిలీ

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఆరోపణలను ఎదుర్కొంటున్న వార్డెన్‌ కిరణ్మయి, గణితం ఉపాధ్యాయురాలు తిరుపతమ్మను బదిలీ చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఆర్‌సీఓ రాజునాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన కళాశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందని, నీటి సమస్యలను పట్టించుకోలేదని వచ్చిన ఆరోపణలపై గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో భాగంగా వారి ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఏటూరునాగారం గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్న కిరణ్మయిని మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలకు బదిలీ చేయగా, గణితం ఉపాధ్యాయురాలు తిరుపతమ్మను కొమురం భీం జిల్లా జైనూర్‌కు బదిలీ చేసినట్లు వివరించారు.

వరుణుడి జోరు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపాడు. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం నివేదిక ప్రకారం శనివారం రాత్రి 9 గంటల వరకు వరంగల్‌ జిల్లా రాయపర్తిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేటలో 82 మిల్లీమీటర్లు, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో 78.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడలో 73.8, నెక్కొండ మండలం రెడ్లవాడలో 73.5, చెన్నారావుపేటలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవపూర్‌లో 53.3, ములుగు జిల్లా మంగపేటలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా కొడకండ్లలో 51.8, దేవరుప్పులలో 49, వరంగల్‌ జిల్లా నెక్కొండలో 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.

ములుగులో 27.4 మిల్లీమీటర్లు..

జిల్లాల సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వరంగల్‌లో 33.3 మిల్లీమీటర్లతో అత్యధికంగా నమోదైంది. ములుగు 27.4, మహబూబాబాద్‌ 24.8, జయశంకర్‌ భూపాలపల్లి 16.7, జనగామ 12.8, హనుమకొండ 8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్నటితో పోలిస్తే వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వర్షపాతం పెరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మాత్రం నిన్నటి 18.2 మిల్లీమీటర్లతో పోలిస్తే శనివారం సగటు వర్షపాతం 16.7 మిల్లీమీటర్లుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement