ములుగు: ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం సర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నోటీసులు అందుకున్న అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఆధారాలు సమర్పించాలని సూచించారు. అర్హులందరూ జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఆక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, నవంబర్ 5 వరకు నోటీసులపై విచారణ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం, నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


