ములుగు: ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా సాగుకు యోగ్యమైన భూములకు పెట్టుబడిసాయం అందిస్తూ అండగా నిలుస్తోంది. ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా రూ.12 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. జూన్ 15 వరకు కొత్త పాస్‌బుక్కులు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడిసాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటి(ఆదివారం) వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయ శాఖ పేర్కొంది.
562 మంది రైతులు..
జిల్లాలోని 10 మండలాల పరిధిలో నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు 562 మంది ఉన్నారు. నేటి వరకు రైతు భరోసా పథకానికి నూతనంగా పట్టా పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆరెకరాల వరకు అందిన పెట్టుబడి సాయం
జిల్లాలో వానాకాలం సాగు సీజన్ కోసం ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆరెకరాల వరకు పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో 88,450 మంది రైతులకు రూ.106.35 కోట్ల సాయం ప్రభుత్వం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 75,487 మంది రైతులకు రూ. 76.74 కోట్లు రైతు ఖాతాల్లో జమచేసింది. తొమ్మిది రోజుల్లోపు రైతు భరోసా డబ్బులు అందిస్తామని ప్రకటించి ఎకరం నుంచి ఆరెకరాల వరకు పెట్టుబడి సాయాన్ని అందించింది. మిగిలిన రైతాంగానికి కూడా మరో నాలుగు రోజుల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా కోసం నేటి(ఆదివారం) వరకు దరఖాస్తులు సమర్పించాలి. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్ల సవరణకు సైతం దరఖాస్తులు స్వీకరించి వివరాలు నమోదు చేస్తున్నాం. జిల్లాలో నూతనంగా పట్టాపాస్‌బుక్కులు పొందిన 562 మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – సురేశ్‌కుమార్, డీఏఓ
జిల్లాలో 562 మందికి కొత్త పాస్‌పుస్తకాలు
నేడు దరఖాస్తులకు చివరిరోజు
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు


