న్యూస్‌రీల్
భూపాలపల్లి జిల్లా వేదికగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రేవంత్ శ్రీకారం
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనం
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ములుగు: జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్(టాస్) పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 772 మంది విద్యార్థులకు గాను 633 మంది హాజరయ్యారు. 139 మంది గైర్హాజర్ అయినట్లు వివరించారు. ఇంటర్మీడియట్‌లో 967 మందికి 817 మంది విద్యార్థులు హాజరు కాగా 150 గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. జిల్లాలోని 10 కేంద్రాలలో టాస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బసవేశ్వరుడి
జయంతి వేడుకలు
ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సిబ్బంది మొగిలి, సరిత, మానస, రేణుక, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి
ములుగు రూరల్: జిల్లాలో ఉన్న వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన
రైతులను ఆదుకోవాలి
ములుగు రూరల్: వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలను రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు భీరెడ్డి సాంబశివ మాట్లాడారు. గతేడాది వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, గపూర్ పాషా, సాంబశివరావు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
వాహనాలు సీజ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఇప్పగూడెం ఇసుక ర్యాంప్ వద్ద అనుమతులు లేకుండా పనులు నిర్వహిస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్‌ను టీఎండీసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టీఎండీసీ పీఓ రాజు కథనం ప్రకారం.. ఇప్పగూడెం ఇసుక ర్యాంప్‌లో అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని గ్రామస్తులు గిరిజన దర్బార్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇసుక ర్యాంప్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీఎండీసీ అధికారులను ఆదేశించారని తెలిపారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని అనుమతులు లేకుండా పనులు చేస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఆర్‌వో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్‌జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు.
సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష..
మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు.
ప్రతిపక్షాలపై నిప్పులు..
అభివృద్ధి, సంక్షేమానికి హామీ..
కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్‌ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా
కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
నస్తూర్‌పల్లి
బహిరంగ సభలో
అభివాదం
చేస్తున్న
సీఎం
రేవంత్
‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి.
– ఆలం రామలక్ష్మి, మేడారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి
వెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్‌కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్‌ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు.
●
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: జాకారం గురుకుల పాఠశాలలో 2026–27లో ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అనిత అన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. సీట్ల ఎంపిక లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుందని వివరించారు.
ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు
ఎన్‌డీఎస్‌ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం
బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన


