న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మండల సభల నిర్వహణ లేక సర్పంచ్‌ల ఆవేదన
ములుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు గ్రామ సర్పంచ్‌లు కృషి చేయాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం కొత్తగా ఎన్నికై న సర్పంచులకు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లడానికి సరైన వేదిక దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలకు మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. మండల సభలలో తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు సర్పంచ్‌లు కృషి చేసేవారు. ఈ సభల నిర్వహణతో అధికారులు, సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. గత రెండేళ్లుగా ఎంపీటీసీలు లేకపోవడంతో మండల సభలు ముందుకుసాగడం లేదు. గత డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో మంగపేట మండలం మినహా జిల్లాలోని 9 మండలాల పరిధిలో 146 పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు.
గతంలో మూడు నెలలకోసారి సభలు
మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ఉండి ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్‌లు హాజరయ్యేవారు. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు డివిజన్ స్థాయి అధికారులు సైతం హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమశాఖ తరఫున చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించేందుకు మూడు నెలల ప్రగతి నివేదికతో సమావేశానికి వచ్చేవారు. ఈ సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్ధక, అటవీశాఖ, రెవెన్యూ శాఖతో పాటు 23 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి ప్రజాప్రతినిధులకు వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారీగా అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రజాప్రతినిదులు లేవనెత్తిన సమస్యలపై అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. దీంతో ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ మండలాభివృద్దికి తోడ్పాటునందించేవారు.
సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియని అయోమయం
గతంలో మూడు నెలలకోసారి నిర్వహణ
ఎంపీటీసీలు లేకపోవడంతో
కొనసాగని సభలు


