ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

మంగపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మల్లూరు జీపీ, మంగపేట పీహెచ్‌సీ ఆవరణలో మంగళవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ దివాకరతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలాన్ని 6 జోన్లుగా విభజించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తెలిపిన సమస్యలను రెండున్నర గంటల పాటు సీతక్క ఓపికగా వింటూ వినతులు స్వీకరించారు. మండల కేంద్రంలో వారాంతపు సంత, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, నూతన బస్టాండ్‌ ప్రారంభోత్సవంతో పాటు ప్రతీ గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల విడుదల చేసిన టైడ్‌, అన్‌టైడ్‌ నిధులను నిబంధనల ప్రకారం గ్రామసభల ద్వారా ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రజలకు తాగునీరు. వీధిలైట్లు, తాగునీటి లీకేజీ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి సీతక్క కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, వివిద శాఖల అధికారులతో కలిసి మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో ఈనెల 27 నుంచి మే 6 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం బోరునర్సాపురంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణం పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు. అలాగే సండ్రోని ఒర్రె అటవి ప్రాంతంలోని శాంతినగర్‌ గొత్తికోయగూడెంలోని గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌తో కలిసి భోజనం చేశారు. గిరిజనులు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా నీటి సంప్‌ను మంత్రి ప్రారంభించారు. మూడేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, బాలామృతం, ఫ్రీప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, హేమాచల క్షేత్రం ఈఓ వీరస్వామి, డీసీసీ అధ్యక్షుడు అశోక్‌, ఉపాధ్యక్షుడు వల్లిపల్లి శివప్రసాద్‌ గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ

మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement