వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి..
ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్‌ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్‌ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్‌ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్‌ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్‌స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్‌ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్‌పార్టీ లింగారావు, ఏఆర్‌ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు,శ్రీరాములు, ఇంతేజార్‌గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
రూ.2.50 కోట్ల విలువైన
హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన వరంగల్
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్


