సొంతూరుకు దామోదర్‌.. | - | Sakshi
Sakshi News home page

సొంతూరుకు దామోదర్‌..

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్‌ 28 ఏళ్ల తర్వాత మంగళవారం తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన దామోదర్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దామోదర్‌ను కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. దామోదర్‌ అజ్ఞాతంలోకి వెళ్లి చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన దామోదర్‌ను చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. దామోదర్‌ వస్తున్న విషయాన్ని తెలుసుకొని కాల్వ పల్లి చుట్టూ పక్కల గ్రామాలు నార్లాపూర్‌, కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, కొత్తూరు, వెంగళాపూర్‌, పడిగాపూర్‌ గ్రామస్తులు కాల్వపల్లికి భారీగా తరలొచ్చారు. తనకు తెలిసిన ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు, తన చిన్ననాటి స్నేహితులను, తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులను దామోదర్‌ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా దామోదర్‌ను కలిసి ముచ్చటించారు.

దామోదర్‌కు ఘనసన్మానం

సాయుధ పోరాటం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దామోదర్‌ను గ్రామస్తులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. 28 ఏళ్ల అడవి బాట వీడి గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని దామోదర్‌ పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేస్తానని తెలిపారు.

చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement