ఏటూరునాగారం: మండల పరిధిలోని అల్లంవారిఘణపురం పరిధిలో గల గుర్రాలబావి అటవీ ప్రాంతం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములను ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు వారాల క్రితం గిరిజనదర్బార్‌లో కలెక్టర్ దివాకరకు అల్లంవారిఘణపురంలోని గుర్రాలబావి దగ్గర ఉన్న రైతులు కాపుల సమ్మయ్య, రెడ్డి శంకరయ్య, ఆర్కె సమ్మయ్యలు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ఎస్‌డీసీ గ్రామాన్ని, భూములను పరిశీలించారు. పట్టా భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీశారని రైతులు గోడు వెలిబుచ్చారు. భూ రికార్డులు రైతుల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ మా భూములు మాకు ఇప్పించాలని వేడుకున్నారు. సాగు చేసుకొని బతికేవాళ్లమని, దీనిలో కందకాలు తీయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఉన్న అటవీ హక్కు పత్రాలు(ఆర్‌ఓఎఫ్‌ఆర్) , భూములు వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీశ్, సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు.


