సీఎం హామీ ఇచ్చినా
నెరవేరకపాయే..
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేదెప్పుడు
భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు జిల్లాలో పెండింగ్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు
● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు లేకపోవడంతో చిన్నచిన్న రోగాలకు సైతం ఎంజీఎం, వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
● జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభు త్వ హయాంలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. సుమారు లక్షకు పైగా జ నాభా ఉన్న ఈ పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
● గత ప్రభుత్వాలు జిల్లాలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ 1ను ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించగా, ప్రాజెక్ట్ 2ను సింగరేణి సంస్థకే అప్పగించి పనులు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
● సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు, కేటీపీపీ పరిశ్రమ ఉన్న ఈ జిల్లాలో ఇంజనీరింగ్, మైనింగ్ కళాశాల, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైన పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
జిల్లా కేంద్రం అనంతరం కాటారం రెవెన్యూ డివిజన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కాటారం, సమీపంలోని నస్తూర్‌పల్లి, మద్దులపల్లి, చిదినెపల్లి, పోతులవాయి, ఇబ్రహింపల్లి, బయ్యారం గ్రామాలను కలిపి కాటారాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న గణపురం మండలం చెల్పూరు పరిధిలోని సింగరేణి వేయి క్వార్టర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరాల జల్లులు కురిపించారు.
కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోర్డును రద్దు చేసేది లేదని, కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించారు.
217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కారుణ్య నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండగా, డిస్మిస్డ్ కార్మికుల ఊసే లేదు.
భూపాలపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం కేటాయించిందని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదు.
సాధారణ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సింగరేణి సంస్థలో మారు పేర్లను సవరిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
బైపాస్ రోడ్డు పనుల
ప్రారంభమెప్పుడో
సింగరేణిలో కారుణ్య నియామకాలు కలేనా..?
217 మంది
డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితేంటి
నేడు జిల్లాలో
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన


