నేడు ఐటీడీఏలో గిరివాణి | - | Sakshi
Sakshi News home page

నేడు ఐటీడీఏలో గిరివాణి

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

22 నుంచి సమ్మెకు సిద్ధం

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నేడు (సోమవారం) గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ, కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏకు చేరుకొని వారి వినతులు సమర్పించాలని కోరారు.

విద్యార్థులు క్రీడల్లో

రాణించాలి

న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్‌) రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ జంగా సతీశ్‌ అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్‌ క్యాంప్‌ను ఆదివారం వరంగల్‌ శంభునిపేట, వరంగల్‌(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్‌ మాట్లాడుతూ.. సమ్మర్‌క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ అధి కారులు సయ్యద్‌ అక్బర్‌, మక్బూల్‌పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్‌ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అద్దె బస్సుల స్కీం కొనసాగించాలి

హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్‌ కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్స్‌లో ఆర్టీసీ హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వరంగల్‌ రీజియన్‌స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్‌మెంట్‌ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్‌ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వరంగల్‌ రీజియన్‌ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు బాలవర్ధన్‌రెడ్డి, ఎన్‌.ప్రసాద్‌, హబీబ్‌, జె.వెంకట్‌రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్‌, జి.వెంకన్న, కె.భాస్కర్‌రెడ్డి, కుమార్‌, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు.

నయీంనగర్‌: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్‌ ఆవరణలోని వరంగల్‌–1 డిపో ఎదుట రీజియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న, వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్‌ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్‌ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement