● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు
● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు
న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌క్లోజర్‌లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.


