భానుడి భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ

Apr 19 2026 7:59 AM | Updated on Apr 19 2026 7:59 AM

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

చల్వాయి రోడ్డుపై కనిపించని జనం

నిర్మానుష్యంగా మారిన 163 జాతీయ రహదారి

గోవిందరావుపేట: భానుడు భగభగ మండిపోతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో శనివారం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యాయి. మంగపేట మండల పరిధిలోని మల్లూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదు కాగా ములుగులో అత్యల్పంగా 41.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉండటం గమనార్హం.

నిర్మానుష్యంగా రహదారులు

ఉదయం 9 గంటలకే భానుడు మండిపోతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి ప్రధాన రహదారులు, మార్కెట్‌ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు తప్పా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చిన్నచిన్న వ్యాపార సముదాయాలు, టీ స్టాళ్లు, తినుబండరాల దుకాణాలు, బట్టల షాపులు కష్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం 5గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.

వడదెబ్బతో ప్రాణాపాయం

అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ(హీట్‌ స్ట్రోక్‌) బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అధికంగా ఎండ ఉన్న సమయంలో ఎక్కువసేపు బయట తిరగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు ఆకస్మాత్తుగా పెరిగి వడదెబ్బకు గురై ప్రాణాపాయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు., బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తలనొప్పి, వాంతులు, తలతిరగడం, అధిక దాహం, శరీరం బలహీనత వంటి లక్షణాలు కనిసిప్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ పొందాలంటే మాధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తరచూ నీరు తాగ డం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలి.. తలకు టవల్‌ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గిపోకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలి, తలకు టవల్‌ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వేళ్లేటప్పుడు ఖచ్చితంగా వాటర్‌ బాటిల్‌ వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్‌ను సంప్రదించాలి.

– గోపాల్‌రావు, జిల్లా వైద్యాధికారి

మల్లూరులో అత్యధికంగా 43.5డిగ్రీల సెల్సియస్‌ నమోదు

బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు

నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు

Advertisement
 
Advertisement
Advertisement